ఫిబ్రవరి చివరి వారంలో తొలిసారిగా ఇండియాలో పర్యటించేందుకు వస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లకు స్వాగతం పలకడానికి భారత్ సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ జంట ఫిబ్రవరి 24, 25 తేదీల్లో (US President's India Visit) భారత్ లోని దిల్లీ, ఆగ్రా మరియు అహ్మదాబాద్ నగరాలలో పర్యటించనున్నారు.

ఇక ట్రంప్ పర్యటన కోసం ఆయన కాన్వాయ్ కూడా ఇప్పటికే గుజరాత్ చేరుకుంది. అందులో డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే అత్యంత విలాసవంతమైన, హైటెక్ కారు- 'కాడిలాక్ వన్'  (Cadillac One) కూడా ఉంది.

ఈ కారును అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ కారును భద్రతాపరంగా ప్రపంచలోనే అత్యంత సురక్షితమైన కారుగా చెప్తారు. ఈ కారును ప్రెసిడెన్షియల్ కారు లేదా 'ది బీస్ట్' (The Beast) అని కూడా పిలుస్తారు. ఈ అధునాతనమైన ద బీస్ట్ కారు 2018 సెప్టెంబర్‌లో యూఎస్ ప్రెసిడెంట్ కాన్వాయ్ లోకి వచ్చి చేరింది.

ఫిబ్రవరి 24న గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో అడుగుపెట్టనున్న డొనాల్డ్ ట్రంప్ 'ది బీస్ట్' లో నేరుగా మొతెరాలోని సర్దార్ పటేల్ స్టేడియంకు వెళ్తారు. ఆయన రాక నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, ఎక్కడా 'మురికి' కనిపించకుండా పూర్తిగా 'కప్పి' వేశారు. ఇక ట్రంప్ దర్జాగా బీస్ట్ కారులో కూర్చుని స్టేడియం వైపు ప్రయాణించే సమయంలో లక్షలాది మంది ఆయనకు హారతులు పడుతూ స్వాగతం ఇవ్వనున్నారు. దారి పొడవునా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటే చిత్రాలు, అనేక చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ పేరుతో కేవలం 3 గంటలు సాగే ట్రంప్ పర్యటన కోసం గుజరాత్ ప్రభుత్వం సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇక ద బీస్ట్ విషయానికి వస్తే, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా, ఆ కాడిలాక్ వన్‌ కార్ అక్కడికి వెళ్తుంది, అందులోనే ప్రెసిడెంట్ ప్రయాణిస్తారు. ప్రెసిడెంట్ రక్షణ కోసం ద బీస్ట్ లో అనేక రకాల భద్రతా ఏర్పాట్లు, అధునాతనమైన ఫీచర్లు అమర్చబడి ఉంటాయి.

కాడిలాక్ వన్- ది బీస్ట్ కార్ ప్రత్యేకతలు - విశేషాలు

 

‘ది బీస్ట్’ అని పిలిచే కారు అధ్యక్షుడి కోసం కేటాయించబడే అధికారిక వాహనం. ఈ ప్రెసిడెన్షియల్ స్టేట్ కారు యొక్క ప్రస్తుత మోడల్ సెప్టెంబర్ 24, 2018న ప్రారంభమైన కాడిలాక్ వన్. ఈ కారును ప్రత్యేకంగా ప్రెసిడెంట్ కోసమే తయారు చేయడం మినహా, ఎవరి కోసం కూడా అమ్మకానికి లభించదు.

ఈ కారు భారీ సైజులో, ధృడంగా కనిపిస్తుంటుంది. ఈ కారుకు 'గుడ్‌ఇయర్' రీజినల్ RHS టైర్లు అమర్చబడి ఉంటాయి, ఇవి సాధారణంగా ఇవి అమెరికాలో హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం ప్రత్యేకింగా తయారు చేయబడేవి. ఈ టైర్ల బరువే సుమారు 6,800 నుండి 9,100 కిలోల వరకు ఉంటాయి. ఇవి పగలవు, పంక్చర్ కావు, ఒకవేళ ఏదైనా అయినప్పటికీ కూడా ప్రయాణానికి అనుకూలించే సామర్థ్యం కలవి.

'ది బీస్ట్' యొక్క కిటికీ అద్దాలు బుల్లెట్ల ప్రూఫ్ కలిగిన ఐదు పొరలతో తయారు చేయబడ్డాయి. అద్దాల మందం 5 అంగుళాలు ఉండగా, ఇక డోర్లు 8 అంగుళాలతో ఉంటాయి. ఇవి బోయింగ్ 757 యొక్క క్యాబిన్ తలుపుల బరువును కలిగి ఉంటాయి. ఈ కారు కిటికీలు తెరుచుకోవు, డ్రైవర్ పక్కన ఉండే కిటికీ మాత్రం కేవలం 3 అంగుళాల మేర తెరుచుకోగలదు.

Donald Trump's Car (Photo Credits: Wikimedia Commons)

లోపలి నుంచే ప్రయోగించేలా ఈ కారుకు షాట్ గన్స్, గ్రనేడ్ లాంచర్స్, టియర్ గ్యాస్ షెల్స్ తో అమర్చబడి ఉంటాయి. అలాగే గ్రనేడ్ దాడిని సైతం తట్టుకునే విధంగా 5 అంగుళాల మందం గల ధృడమైన స్టీల్, అల్యూమినియం, టెటానియం మరియు సెరామిక్స్ లాంటి కవచాలతో నిర్మించబడింది.

డ్రైవర్ క్యాబిన్ లో అధునాతనమైన జీపీఎస్ సిస్టమ్, రూట్ క్లియరింగ్, శాటిలైట్ వ్యవస్థ అమర్చబడి ఉంటాయి. అమెరికా కారు ఎక్కడికి వెళ్లినా, రియల్ టైం పర్యవేక్షణలో ఉంటుంది.

ఇక ప్రెసిడెంట్ కూర్చునే క్యాబిన్ లో శాటిలైట్ ఫోన్, అత్యవసర కిట్లు, ప్యానిక్ బటన్, అగ్నిమాపక వ్యవస్థ, మెడిసిన్స్ తో పాటు ప్రెసిడెంట్ బ్లడ్ గ్రూపుకు సరిపోయే బ్లడ్ బ్యాగులు ఉంటాయి.

దీని ఇంధన ట్యాంక్ కూడా ధృడమైన రక్షణ కవచాలతో తీర్చిదిద్దబడి ఉంటుంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ పేలిపోయే అవకాశం లేకూడా నిర్మించారు.

ఈ కారు కూడా అన్ని రకాల సెన్సార్ వ్యవస్థలు కలిగి ఉంటుంది, ఎలాంటి అణు, రసాయన, జీవ దాడులు చేసిన ఆ వెంటనే ప్రతిస్పందించి. అందుకనుగుణంగా రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది.

బీస్ట్ డ్రైవర్లకు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ తో శిక్షణతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రెసెడెంట్ ను కాపాడేందుకు అవసరమయ్యే శిక్షణలు కూడా ఇస్తారు. కారును 180 డిగ్రీలలో ఎలా తిప్పాలి అనేదానిపై శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు డ్రైవర్ ఆరోగ్యం, మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతే డ్రైవింగ్ కు అనుమతించబడతారు.