New Delhi, October 21: దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు మోదీ సర్కార్ బోనస్ ప్రకటించింది. ఇందుకోసం తక్షణం రూ. 3,737 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర కేబినేట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ ఆమోదించిన నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
2019-2020 సంవత్సరానికి గానూ ఉత్పాదక అనుసంధాన బోనస్ మరియు ఉత్పాదక రహిత బోనస్‌ను ప్రకటించాలని కేంద్ర కేబినేట్ నిర్ణయించింది, దీంతో 30 లక్షల నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని జవదేకర్ అన్నారు. అలాగే ఈ బోనస్‌ను దసరాలోపే ఒకే విడతలో ఉద్యోగుల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
దేశంలో కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం బోనస్ ప్రకటనపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఈ ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఉత్సాహాన్ని నింపినట్లయింది.
దసరా బోనస్ పొందే లబ్ధిదారులలో రైల్వేలు, పోస్టాఫీసు, ఇపిఎఫ్ఓ, ఇఎస్ఐసి వంటి వాణిజ్య సంస్థలలో సేవలందించే 17 లక్షల మంది గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారు, వీరికి ఉత్పాదకత-అనుసంధాన బోనస్ లభిస్తుండగా ఇతర సేవలకు చెందిన 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్ పొందుతారు.