Election Commission of India. (Photo Credit: Twitter)

New Delhi, FEB 09: ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదంటే సాధారణంగా అందరూ చైనాయేనని (China) చెబుతారు. కానీ.. ఇండియా చైనాను ఎప్పడో దాటేసింది. ఇప్పుడు మన దేశం మరో రికార్డును కూడా దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు (Highest Voters) కలిగిన దేశంగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం దాదాపు 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. 142 కోట్ల 86 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన ఇండియా (India).. ఇప్పుడు మరో రికార్డుకెక్కింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 96 కోట్ల 88 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రిజిస్టర్ అయిన ఓట్ల సంఖ్య 6% పెరిగిన‌ట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ తెలిపారు. కొత్తగా ఓట్లు రిజిస్టర్ చేసుకున్న వారిలో మహిళలు, యువతే అధిక సంఖ్యలో ఉన్నారు.

 

పార్లమెంట్ ఎన్నికల ముందు దేశంలో ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 96 కోట్ల 88 లక్షల 21 వేల 926 మంది ఓటర్లున్నారు. 2019తో పోల్చితే 7 కోట్ల 20 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇందులో పురుషులు 49కోట్ల 72 లక్షల 31 వేల 994 మంది కాగా.. మహిళలు 47 కోట్ల 15 లక్షల 41 వేల 888, థర్డ్ జెండర్స్ 48 వేల 044 మంది ఉన్నారు. 88 లక్షల 35 వేల 449 మంది దివ్యాంగులు ఉండగా.. 2 లక్షల 38 వేల 791 మంది వందేళ్లకు పైబడిన వారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు వారు 19 కోట్ల 74 లక్షల 37 వేల 160 మంది ఉండగా.. కోటీ 84 లక్షల 18 నుంచి 19 ఏళ్లలోపు వారు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఇంటింటికి వెళ్లి పూర్తిస్థాయి పరిశీలన తర్వాత 67 లక్షల 82 వేల మంది చనిపోయిన వారి ఓట్లతో పాటు.. 22 లక్షల 5 వేల నకిలీ ఓట్లు తొలగించినట్లు ఈసీ ప్రకటించింది.

కొత్తగా నమోదైన 2 కోట్ల 63 లక్షల ఓటర్లలో కోటీ 41 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఓటు న‌మోదు చేసుకోని వారు ఇంకా త‌మ ఓటును న‌మోదు చేసుకునే అవ‌కాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.