New Delhi, March 29: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. మొత్తం 224 అసెంబ్లీ (Assembly elections) స్థానాలున్న కర్ణాటకలో ఎన్ని విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారనే విషయంపై మరికాసేపట్లో స్పష్టత వస్తుంది. కాగా, ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనున్న నేపథ్యంలో ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ (BJP) 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ (Congress) 78 సీట్లు, జేడీఎస్ (JDS) 37 సీట్లలో గెలుపొందాయి. మరో ముగ్గురు ఇతరులు విజయం సాధించారు.
తొలుత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఏడాదిన్నర కూడా ఆ ప్రభుత్వం నిలబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చిన బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. తొలి జాబితాను ప్రకటించింది. ఈ నెల 25న 124 మందికి టికెట్ కేటాయిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేస్తుండగా, వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోలార్ నుంచి ఆయన కుమారుడు, కొరటగెరె నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, దేవనహళ్లి నుంచి మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, చితాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు.
ఇక ఈ సారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కూడా బరిలోకి దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జేడీఎస్‌కు మద్దతు ప్రకటించారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. అక్కడ తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తామంటున్నారు. కాగా, 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటికే నాగాలాండ్, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇక మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.