File image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, Mar 28: సుప్రీం కోర్టులో ఇవాళ(మంగళవారం) అమరావతి కేసు (Amaravati capital case) విచారణ జరిగింది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్ ను సత్వరమే విచారించాలన్న ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒకే కేసు పూర్తి కానిదే మరో కేసు ఎలా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం అలా వెళ్లలేమని స్పష్టం చేసింది.

ఇవాళ సుప్రీంకోర్టులో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు విచారణ జరుగుతుండగా లంచ్ బ్రేక్ వచ్చింది. విరామం అనంతరం ఇతర కేసులు, పలు అంశాలకు సంబంధించి మెన్షనింగ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా తమ కేసు విచారణ మొదలుపెట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరినప్పుడు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం పైవిధంగా స్పందించింది.ఓవైపు ముంబయి కార్పొరేషన్ కేసు విచారణ సగంలో ఉంటే, దాన్ని వదిలేసి మీ కేసు తీసుకోమంటారా? అని అసహనం జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వెలిబుచ్చారు.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారు.. ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు

ఇక, జులై 11న అమరావతి అంశాన్ని (SC posts for hearing on July 11) తొలి కేసుకు విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అటు, రాజధాని పిటిషన్ దారుల్లో కొందరు రైతులు మరణించారని, వారి స్థానంలో ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతించాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోరారు. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసిన విషయాలు..

► రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం.

► తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుంది.

► ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు.

► రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను ఏపీ హైకోర్టు పట్టించుకోలేదు.

► రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి.

► 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. అదే రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది.

► రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం.

► వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది.