New Delhi, May 18: జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్‌ను (FASTag in India) ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం విదితమే. అయితే చాలా వాహనాలు ఇంకా ఫాస్టాగ్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. ఇలా ఫాస్టాగ్ (FASTags) లేని వాహనాలకు ఇకపై జాతీయ రహదారులపై (National Highways) డబుల్ టోల్ ఫీజు వసూలుచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. మనుషులకు ఆధార్ కార్డ్ లాగా, వాహనాలకు ఫాస్టాగ్స్, రహదారులపై నడిచే అన్ని వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరి, ఫాస్టాగ్స్ ఎలా పొందాలి? రీఛార్జ్ వివరాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి
2020 మే వరకు దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్‌లను ప్రభుత్వం మంజూరుచేసింది. కానీ, ఇంకా చాలావరకు వాహనాలు ఫాస్టాగ్ లేకుండానే హైవేలపై తిరుగుతున్నాయి. ఇకపై వాటికి డబుల్ టోల్ ఫీజు వసూలుచేయనున్నారు. ఫాస్టాగ్ లేకున్నా లేదా సరిగా పనిచేయని ఫాస్టాగ్ ఉన్నా ఆ వాహనాలు టోల్‌ఫ్లాజా వద్ద ఫాస్టాగ్ లేన్‌లోకి ప్రవేశించరాదు. ఒకవేళ ఆ వాహనాలు ఫాస్టాగ్ లేన్‌లోకి వస్తే ఆ వాహనానికి టోల్‌ఫీజును రెండురెట్లు ఎక్కువగా వసూలుచేస్తారు.
ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏమిటి?
ఫాస్టాగ్ అనేది NHAI లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత నిర్వహించబడే ఎలక్ట్రానిక్ టోలింగ్ వ్యవస్థ. లింక్ చేయబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి ప్రత్యక్ష టోల్ చెల్లింపులు చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ను ఉపయోగించే ఫాస్ట్ ట్యాగ్, వాహనం యొక్క విండ్‌షీల్డ్‌పై అతికించి ఉంటుంది. నగదు చెల్లింపు కోసం ఆపకుండా వినియోగదారుడు ప్రత్యేకమైన ఫాస్ట్‌టాగ్ టోల్ లేన్ గుండా వెళ్ళడానికి ఇది వీలు కల్పిస్తుంది.
వివిధ బ్యాంకులు మరియు NHAI / IHMCL ఏర్పాటు చేసిన పాయింట్-ఆఫ్-సేల్ ప్రదేశాల నుండి ఫాస్ట్ ట్యాగ్లను కొనుగోలు చేయవచ్చు, ఇందులో అన్ని జాతీయ రహదారి ఫీజు ప్లాజాలు, సాధారణ సేవా కేంద్రాలు, RTO లు, బ్యాంక్ శాఖలు ఉన్నాయి. ఫాస్ట్‌యాగ్‌ను ఆన్‌లైన్‌లో పేటీఎం, అమెజాన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.