File image of EPFO office | (Photo Credits: PTI)

New Delhi, March 5: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు ఇది నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై (EPFO Interest Rate) కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయించింది.

పీఎఫ్‌ వడ్డీరేటు (PF interest Rate) కుదింపుపై నేడు (మార్చి 5, గురువారం) సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ తుది నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేటును 8.5 శాతంగా ఉంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. పీఎఫ్‌ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఈపీఎఫ్‌వోలోని 60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం చేయనుంది.

ఓసారి ఈపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్ర చూస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2015-16 లో 8.8 శాతం, 2016-17 లో 8.65 శాతం వడ్డీ ఉండేది. కానీ 2017-18 సంవత్సరంలో 8.55 శాతానికి వడ్డీని తగ్గించారు. ఆ తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీని 8.65 శాతానికి పెంచడం కోట్లాది మది ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు చేసింది.

Update by ANI

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 లో వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గించడం మాత్రం ఖాతాదారులకు వచ్చే వడ్డీకి గండి కొట్టినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల సమాన స్థాయికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లను తీసుకురావాలని కార్మిక శాఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ తగ్గించడంతో ఖాతాదారులకు రావాల్సిన వడ్డీ తగ్గుతుంది.