EPFO (Photo-X)

EPFO Closed Covid withdrawal facility: కరోనా సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. కరోనావైరస్ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చిన సంగతి విదితమే. హెల్త్‌ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్‌-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీసేసిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ ఈ కీలకనిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉద్యోగులకు షాకింగ్ న్యూస్, టాప్ టెక్ కంపెనీల్లో భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు

ఈపీఎఫ్‌ఓ నిర్ణయం ప్రకారం.. ఇకపై పీఎఫ్‌ చందాదారులు కొవిడ్‌ అడ్వాన్స్‌ పేరిట భవిష్య నిధి నుంచి సొమ్ములను ఉపసంహరించుకోవడం సాధ్యపడదు. ప్రస్తుతం ఉమాంగ్‌ యాప్‌లోకి వెళ్లి కొవిడ్‌ అడ్వాన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ‘సర్వీసు అందుబాటులో లేదు’ అనే సందేశం కనిపిస్తోంది. కరోనావైరస్ కాలంలో తీసుకొచ్చిన ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ సదుపాయం చాలా మందికి ఉపయోగపడినా.. కొందరు మాత్రం వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారు. 2020 మార్చి 28న తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్‌ సదుపాయాన్ని 2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు. రూ.48 వేల కోట్లు కొవిడ్‌ అడ్వాన్స్‌ రూపేణ ఉపసంహరించుకున్నారని ఈపీఎఫ్‌ వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.