Sexual Criminal: 6 మంది అమ్మాయిలతో పెళ్లి, ఆఫీసులో పనిచేసే మరెంతో మందిపై అత్యాచారం. 'దొంగ' పోలీసును అరెస్ట్ చేసి జైలులోకి నెట్టిన పోలీసులు.
Representational Image. | (Photo Credits: Pixabay)

Chennai, September 17:  అతడు చదివింది 7వ తరగతి మాత్రమే అది కూడా డ్రాప్అవుట్.  కానీ, ఉన్నత చదువులు చదివినట్లు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకొని ఒకర్ని కాదు, ఇద్దరినీ కాదు ఏకంగా 6 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మరెంతో మందిపై అత్యాచార యత్నాలు కూడా చేశాడు. చివరకు పాపం పండి ఆ కామాంధుడు జైలు పాలయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ పట్టణానికి చెందిన ఆర్. రాజేష్ పృథ్వీ (R. Rajesh Prithvi) అనబడే ఒక 29 ఏళ్ల వ్యక్తి దినేశ్, శ్రీరామ గురు, దీనదయాలన్ లాంటి వివిధ పేర్లతో కొన్నేళ్లుగా ఎంతో మంది అమ్మాయిలకు వలవేస్తూ వచ్చాడు. తనని తాను ఒక ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా, ఉన్నత ఉద్యోగిగా చెప్పుకుంటూ 'మ్యాట్రిమొనీ వెబ్ సైట్స్' ద్వారా అమ్మాయిలను ఆకర్శించేవాడు. అందుకు తగినట్లుగా నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఐడీ కార్డులు అన్ని చూపిస్తూ వారి తల్లిదండ్రులను కూడా నమ్మించాడు. అలా ఇప్పటివరకు తిరుప్పూర్, కోయంబత్తూర్, తిరుచునాపల్లి అలాగే ఏపిలోని తిరుపతి, శ్రీకాలహస్తి పట్టణాలకు చెందిన 6 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. వారి దగ్గరి నుంచి నుంచి లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులు ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లో ఇతడిపై కేసులు కూడా నమోదు చేశారు.

అంతేకాదు చెన్నైలోని మానిక్ రామ్ రోడ్డులో మూడేళ్లుగా 'కెవిన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్' (Kavins Management Solutions) పేరుతో ఒక బోగస్ టెలిమార్కెటింగ్ కంపెనీను కూడా నడుపుతున్నాడు. ఈ బోగస్ కంపెనీ ద్వారా ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను చేర్చుకుని వారందరినీ మాయమాటలు చెప్పి లోభర్చుకున్నాడు. అప్పుడప్పుడూ పోలీస్ ఇన్స్ పెక్టర్ యూనిఫాంలో వచ్చి, తానొక ఎస్సై అని సైడ్ బిజినెస్‌గా ఈ కంపెనీ నడుపుతున్నాని చెప్పేవాడు. ఇప్పటివరకు 2 ఎన్ కౌంటర్లు కూడా చేశానని కట్టు కథలు అల్లేవాడు. అలా తన మాట వినని అమ్మాయిలను భయపెట్టి వారిపై ఎన్నోసార్లు అత్యాచారయత్నాలు కూడా చేశాడు. అక్కడ పనిచేసే హౌజ్ కీపింగ్ మహిళలను కూడా ఈ కామంధుడు వదిలి పెట్టలేదు. అయితే పోలీస్ అని చెప్పడంతో బాధిత మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాలపై ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయలేకపోయారు.   ఇదీ చదవండి- కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు, ఆ తర్వాత ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్పమని మళ్లీ అతడ్నే రిక్వెస్ట్ చేశాడు.

ఎప్పట్లాగే ఒక 20 ఏళ్ల అమ్మాయిని కూడా పెళ్లి పేరుతో మభ్యపెట్టి తిరుప్పూర్‌లో ఒక ఇంట్లో బంధించి ఉంచాడు. తమ కూతురు కనిపించడం లేదని అమ్మాయి పేరెంట్స్ జూన్ 30న ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయి రాజేష్ నడుపుతున్న బోగస్ కంపెనీలో పనిచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అప్పట్నించి ఆ దిశగా పోలీసుల వేట ప్రారంభమైంది. ఇదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు మిస్సింగ్ పట్ల మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 9న పోలీసులు రాజేష్ ను పట్టుకున్నారు. తిరుప్పూరు సమీపంలో తన ద్వారా మోసపోయిన ఒక మహిళ ఇంట్లో ఈ 20 ఏళ్ల యువతిని ఉంచాడు. అక్కడ్నించి పోలీసులు ఆ అమ్మాయిని రక్షించి తల్లిదండ్రులకు అప్పజెప్పారు.

రాజేశ్‌ను ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు ఈ దిమ్మతిరిగే విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. చిన్నప్పట్నించే నేరప్రవృత్తితో ఉన్నట్లు తేలింది. హోటల్లో కప్పులు కడిగే వాడు. దుకాణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటుండే వాడు, కొన్ని తమిళ సినిమాల్లో ఇతడికి సరిపోయే చిన్న చిన్న పాత్రలు వేసేవాడని కూడా పోలీస్ ఇంటరాగేషన్‌లో తేలింది. హైకోర్ట్ ఇతడ్ని దోషిగా ప్రకటించి, మళ్ళీ బయటకు రాకుండా తమిళనాడుకు సెంట్రల్ జైలుకు తరలించింది.