Fake Sim Cards: ముంబైలో 30వేల ఫేక్ సిమ్‌ కార్డులు బ్లాక్‌, ఒకే వ్యక్తి పేరుమీద 684 సిమ్ కార్డులు, టెలికాం శాఖ దర్యాప్తులో సంచలన నిజాలు
Representational Image (Photo Credit: PTI)

Mumbai, May 17: ముంబైలో భారీ ఎత్తున ఫేక్ సిమ్ కార్డులను (Fake SIM Cards) డీయాక్టీవేట్ చేశారు పోలీసులు. ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లతో ఫోర్జరీ చేసి తీసుకున్న సిమ్‌ కార్డులను డీయాక్టివేట్ చేశారు. మూడు రోజుల క్రితం ముంబై పోలీసులు భారీ ఫేక్ సిమ్‌ రాకెట్‌ ను (Fake SIM Rocket) గుర్తించారు. ఒకే వ్యక్తి పేరుమీద వందలాది సిమ్ కార్డులు ఉన్నట్లు విచారణలో తేల్చారు. దీంతో టెలికాం డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. ఫేక్ పేర్లు, ఐడీ కార్డులతో తీసుకున్న సిమ్ కార్డులను గుర్తించింది. అలా దాదాపు 30వేలకు పైగా సిమ్ కార్డులు ఉన్నట్లు విచారణలో తేలింది. సిమ్ కార్డు కోసం ఇచ్చిన ఐడీ కార్డులను ఫోర్జరీ చేసి వీటిని తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 62 గ్రూపుల్లో 8,247 మంది సబ్ స్క్రైబర్లను గుర్తించారు.

62 గ్రూపుల్లో ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లను ఉపయోగించి ఈ సిమ్ లను తీసుకున్నారు. ఫేక్ సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై కూడా చర్యలను చేపట్టింది టెలికాం శాఖ. ఒక ముఠాగా ఏర్పడి ఇలా ఫేక్ సిమ్ కార్డులను తీసుకుంట్లున్నట్లు గుర్తించారు. టెలికాం శాఖ చేపట్టిన దర్యాప్తులో ఒకే వ్యక్తి పేరు మీద 684 సిమ్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. అలాంటివి చాలా ఉన్నాయని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.