Hyderabad, January 17: కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways) రహదారులపై వెళ్ళే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ పొడగించిన గడువు జనవరి 15తో ముగిసింది. హైవేల వద్ద టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ కనీసం 60 శాతం పెరిగిందని రవాణా మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఇంతవరకూ బాగానే ఉంది, అయితే ఏ ఉద్దేశ్యంతో మాత్రం ఫాస్టాగ్స్ (FASTags) ను ప్రవేశపెట్టారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం NHAI విఫలమవుతోంది.
టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి నిరీక్షణ లేకుండా, అడ్డంకులు లేని ప్రయాణం చేయండంటూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా డిజిటల్ రూపంలో టోల్ టాక్స్ చెల్లించేలా ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఫాస్టాగ్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు టోల్ ప్లాజాల వద్ద వాహనాల సగటు నిరీక్షణ సమయం 29 శాతం పెరిగింది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. అందరు వాహనదారులు ఫాస్టాగ్‌ను వినియోగించకపోవడం ఒకటి కాగా, ఫాస్టాగ్ ఉన్నా టోల్ ప్లాజా వద్ద సాంకేతిక అవంతరాలు, స్కానర్ గుర్తించకపోవడం, ఫాస్టాగ్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదని టోల్ సిబ్బంది నిలిపివేయడం ఇతరత్రా కారణాలతో నిరీక్షణ సమయం ఇంకా పెరుగుతోంది. FAStag ఎలా పొందవచ్చు?
సెంట్రల్ టోల్ ప్లాజా ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థ నుండి వచ్చిన డేటా ప్రకారం, 2019లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం వేచి ఉన్న సగటు సమయం 7 నిమిషాల 44 సెకన్లు. ఇక ఫాస్టాగ్ అమలైన డిసెంబర్ 15 నుంచి జనవరి 14, 2020 వరకు నిరీక్షణ సమయం 9 నిమిషాల 57 సెకన్లకు పెరిగింది.
ఇక ఫాస్టాగ్ తీసుకున్నా ఉపయోగం లేదని, దీనివల్ల నష్టపోతున్నాం అంటూ కొంతమంది వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక పేటీఎం (Paytm) ద్వారా అదనపు దోపిడీ జరుగుతోంది. ఇప్పటివరకూ తాము 40 మిలియన్ల ఫాస్టాగ్స్ జారీచేసినట్లు పేటీఎం సంస్థ ఇటీవల ఘనంగా ప్రకటించుకుంది. మార్చి నాటికి మరో రెండు మిలియన్ల కస్టమర్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది. అయితే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వీరి కస్టమర్ సర్వీస్ ను పట్టుకోవాలంటే మాత్రం కష్టసాధ్యమవుతోంది.
ఇటీవల నిర్మల్ జిల్లా సమీపంలో గల గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఓ వాహనదారుడు ఫాస్టాగ్ కలిగి ఉండి టోల్ ఛార్జీకి సరిపోయే మొత్తం ఖాతాలో ఉన్నప్పటికీ మినిమం బ్యాలెన్స్ లేదంటూ అతడి నుంచి రెట్టింపు టోల్ వసూలు చేశారు. ఆపై అతడి పేటీఎం ఖాతా నుంచి కూడా టోల్ తీసివేయబడింది. అంటే రెండు సార్లు అతడి వద్ద టోల్ దోపిడి జరిగింది. ఇదే విషయాన్ని టోల్ సిబ్బందితో నిలదీయగా మాకు సంబంధం లేదు, NHAI ను అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోనీ పేటీఎంను అడిగితే వారి కస్టమర్ సర్వీస్ స్పందించే విధానం, కస్టమర్ కేర్ వ్యక్తిని సంప్రదించే విధానం కష్టంగా మారింది. అదీకాక, పేటీఎం అసలు తమ యాప్ లో ఎన్నిసార్లు టోల్ డిడక్ట్ అయిందో అప్ డేట్ కూడా చేయడం లేదు. ఈ రకంగా వాహనదారుడు దోపిడీకి గురవుతున్నాడు.
అలాగే భైంసాలో ఘర్షణలు చెలరేగిన సందర్భంగా అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో గంజాల్, నేరడిగొండ తదితర టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఫాస్టాగ్ ఉండి కూడా సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇంకొన్ని టోల్ ప్లాజాల వద్ద అసలు స్కానర్ కూడా సరిగా పనిచేయదు. అప్పుడు నగదు రూపంలో ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో ఇతర వాహనదారులతో వాగ్వాదం చోటుచేసుకుంటుంది.
భారతదేశంలో తానే టోల్ పద్ధతిని ప్రవేశపెట్టానని ఘనంగా చెప్పుకునే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఇప్పుడు వాహనాలకు ఫాస్టాగ్స్ కూడా తప్పనిసరి చేసిన సందర్భంలో టోల్ చెల్లింపులు, ఇతర సాంకేతిక సమస్యలు ముందుగా పరిష్కారం చేసిన తర్వాత ఫాస్టాగ్ పై కఠినంగా వ్యవహరించాలని, ఆ తర్వాత రెట్టింపు టోల్ వసూలు చేసుకోండి అని ప్రజలు సూచిస్తున్నారు.