Tamilisai Soundararajan will be the new Governor for Telangana, while Bandaru Dattatreya is for Himachal Pradesh.

New Delhi, Sep 1:  కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణ(Telangana) రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్‌ను (Dr. Tamilisai Soundararajan) గవర్నర్‌‌గా నియమించింది. అలాగే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది.  కాగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు గవర్నరుగా సేవలందించి, విభజన తర్వాత చాలా కాలం వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నరుగా సేవలందించిన నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడా నియమించలేదు. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్‌లో గవర్నర్ మార్పు సంగతి తెలిసిందే.  అటు మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యా సాగర్ పదవీకాలం ముగిసింది. ఆయన పదవీకాలాన్ని కూడా కేంద్రం పొడగించలేదు. మహారాష్ట్రకు భగత్ సింగ్ కోశ్యారిని కొత్త గవర్నర్‌గా నియమించింది.

ఇక కేరళ గవర్నరుగా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నియమింపబడ్డారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆరిఫ్ ఖాన్, వివిధ పార్టీలు మారి, ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు గవర్నర్ అయ్యారు. భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నానంటూ ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రకటించిన కొత్త గవర్నర్లు వరుసగా..

తెలంగాణ - తమిళ్ ఇసై సౌందర్ రాజన్

మహారాష్ట్ర - భగత్ సింగ్ కోశ్యారి

కేరళ - ఆరిఫ్ మహ్మద్ ఖాన్

హిమాచల్ ప్రదేశ్ - బండారు దత్తాత్రేయ

రాజస్థాన్ - కల్‌రాజ్ మిశ్రా (ట్రాన్స్‌ఫర్).

తెలుగు రాష్ట్రాలకు తొమ్మిదిన్నర ఏళ్లుగా గవర్నరుగా సేవలందించిన నరసింహన్ ఆయన కాలంలో చోటుచేసుకున్న ఎన్నో రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నియమింపబడిన ఆయన, విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్ అయ్యారు. ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన వారధిగా నిలిచారు. కొద్ది రోజుల కిందటే ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బిశ్వ భూషన్ హరిచందన్ నియమింపబడటంతో నరసింహన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగారు. అయితే అప్పట్నించే తెలంగాణకు కూడా గవర్నర్ మార్పు ఉంటుందనే ఊహగానాలు వెలువడ్డాయి. నేడు అవి నిజమయ్యాయి.

1968 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన నరసింహన్, 2007-09 వరకు ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆయన కాలంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు విశేష కృషి చేశారు. రెండోసారి పదవి ఇవ్వడం బీజేపి హయాంలో నడిచే ప్రభుత్వ సాంప్రదాయంలో ఎక్కడా లేదు. ఈ మూలంగానే ఆయనను తిరిగి ఎక్కడా నియమించలేదు. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్ రావు పరిస్థితి అంతే.