Lucknow, August 3: సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో సారి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా (UP Minister to Marry for the 6th Time) ఆయన మూడో భార్య అడ్డుకుంది, మాజీ మంత్రి చౌధరి బషీర్‌పై ఆయన భార్య నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో యూపీ సర్కార్‌లో మంత్రిగా పనిచేసిన బషీర్‌కు (Former UP Minister Chaudhary Bashir) నగ్మా మూడో భార్య కావడం విశేషం. నగ్మా ఫిర్యాదుపై నిత్య పెండ్లికొడుకు, మాజీ మంత్రిపై (Chaudhary Bashir) ఆగ్రాలోని మంటోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు.
ముస్లిం మహిళా వివాహ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. షైష్ట అనే యువతితో బషీర్ ఆరోసారి పెండ్లికి సిద్దమయ్యాడని తనకు జులై 23న తెలిసిందని ఆమె వెల్లడించారు. బషీర్‌ను సంప్రదించగా తనను వేధించడమే కాకుండా ట్రిపుల్ తలాఖ్‌తో తనకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి గెంటేశాడని నగ్మా వాపోయారు. బషీర్ మహిళలను వేధిస్తుంటాడని 2012లో తనకు ఆయనతో వివాహం జరగ్గా అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేశాడని ఆరోపించారు. మాజీ మంత్రిపై పలు ఆరోపణలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఆమె పోలీసులు తనకు సాయం చేయాలని కోరారు.
గతంలో యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రభుత్వంలో బషీర్ మంత్రిగా వ్యవహరించాడు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరాడు. ఇతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, 23 రోజులపాటు జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిసింది. ముఖ్యంగా భార్యను వేధించిన కేసులో నిందితునిగా గతంలోనే పోలీసుల రికార్డుకెలకెక్కాడు/ తనపై కేసుల దృష్ట్యా బషీర్ ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ నుంచి కూడా వైదొలిగాడని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. ఇతనిపై గల ఆయా కేసుల వ్యవహారాన్ని ఆగ్రా ఖాకీలు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.