Namaste Trump: అమెరికాలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం. కీలక ఒప్పందాలు, సినిమా- క్రికెట్ విశేషాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, పేదరిక నిర్మూలన; ఆల్ రౌండ్ స్పీచ్‌తో అదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్
PM Modi lauding Trumps remarks | ANI Photo

Ahmedabad, February 24:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)  భారత పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది, అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో (Motera Stadium)  జరిగిన 'నమస్తే ట్రంప్'  (Namaste Trump) కార్యక్రమంలో సభకు హాజరైన అశేష జనవాహిని మధ్య ప్రసంగించిన ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిజమైన స్నేహితుడు, ఒక అసాధారణమైన నేత, గొప్ప లీడర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఒక ఛాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన మోదీ, ఈ స్థాయికి రావడం ఎంతో మందికి ఆదర్శం అన్నారు. భారత అభివృద్ధి కోసం మోదీ రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు.

భారత్ అంటే అమెరికాలో ప్రత్యేక స్థానం ఉంటుంది. భారత్ పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయి. అది చాటి చెప్పేందుకే మెలనియాతో కలిసి 8000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాం అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే గతంలో జీఈఎస్ సదస్సు కోసం ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చిందని గుర్తు చేసిన అమెరికా అధ్యక్షుడు, అందుకు ఇవాంకాకు తన తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ట్రంప్ పేర్కొన్నారు. తన పర్యటన యొక్క అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, భారత్- యూఎస్ మధ్య 3 బిలియన్ డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మానవాళి అంతటికి భారతదేశం ఆశను ఇస్తుంది, ఇండియా ఆర్థిక దిగ్గజంగా మారిందని ట్రంప్ అన్నారు.

భారత దేశంలో భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల గురించి కూడా మాట్లాడిన ట్రంప్, దేశంలో ఉన్న సృజనాతకత, ప్రతిభ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రమంలో ఇండియా ప్రతి ఏడాది 2000 వేల సినిమాలను నిర్మిస్తుందని పేర్కొన్నారు. బాలీవుడ్ గురించి, బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన డిడిఎల్జె (దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే) మరియు షోలే లాంటి సినిమాలను ప్రస్తావించారు.

అలాగే క్రికెట్ గురించి కూడా మాట్లాడిన ట్రంప్, సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలకు ఇండియా పుట్టినిల్లు అని పేర్కొన్నారు.

తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని చూసిందని తెలిపిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఇండియా ఎకానమీ కూడా బలపడుతుందని, వచ్చే పదేళ్లలో ఇండియాలో పేదరికం పూర్తిగా నిర్మూలించబడి, మిడిల్ క్లాస్ జనాలు అతిపెద్ద సంఖ్యలో ఉండే దేశంగా మారుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు.