Parameshwara PA Suicide: సోదాలు జరుగుతున్న వేళ మాజీ డిప్యూటీ సీఎం పీఎ ఆత్మహత్య,  ఐటీ శాఖ సోదాల గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పిన పరమేశ్వర, అంతలోనే ఘటన, వెల్లడించిన డిప్యూటీ కమిషనర్ రమేష్
g-parameshwaras-personal-assistant-commits-suicide-two-days-after-income-tax-raids (Photo-PTI)

Bengaluru, October 12:  కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఇంట్లో మూడు రోజుల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర కు దగ్గరైన వారిని విచారిస్తున్నారు. విచారణ జరుగుతున్న ఈ సమయంలో అయితే అనుకోకుండా జి.పరమేశ్వర పీఏ రమేష్‌ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) బి.రమేష్ తెలిపారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ జ్ఞాన భారతి ప్రాంతంలో రమేష్ మృతదేహం లభించిందని, అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామని చెప్పారు. రమేష్‌ కారులో ఒక లెటర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని, ఫోరెన్సిక్‌ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు.

Karnataka Congress's Tweet:

మెడికల్‌ కళాశాల సీట్ల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఐటీ శాఖ పరమేశ్వర, ఆయన బంధువుల ఇంట్లో ఈ మధ్య అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పరమేశ్వర వెంట రమేష్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం స్పందిస్తూ రమేష్‌ చాలా మంచి వ్యక్తి అని, ఐటీ శాఖ సోదాల గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పానని, అంతలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఏ ఒత్తిడి మేరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఐటీ అధికారులు వేధిస్తున్నట్లు రమేష్‌ తన సన్నిహితులతో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు.

జి.పరమేశ్వర ఇంట్లో ఐటీ సోదాలు

కాగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగాయి. బెంగుళూరు, తుముకూరుతోపాటు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 4.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలు పరమేశ్వర, ఎంపీ ఆర్‌ఎల్‌ జలప్ప ఇళ్లల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో 300 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు పాల్గొన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరమేశ్వర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణలో ఓడిపోవడంతో కొత్తగా యడ్యూరప్ప సర్కారు కొలువుతీరింది.