Gautam Adani (Photo Credits: PTI)

ఇప్పటివరకు ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్న ముఖేష్ అంబానీకి ఆదానీ గ్రూప్ అధినేత ఝలక్ ఇచ్చాడు. బ్లూమ్‌బర్గ్ నుండి అందుబాటులో ఉన్న డేటాను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఆసియా నెంబర్ వన్ ధనికుడిగా ఉన్న అంబానీని తాజాగా అదానీ (Gautam Adani Becomes India And Asia's Richest Man) దాటేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండో స్థానంలో ఉన్న గౌత‌మ్ అదానీ మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించారు. నిన్న‌టి వ‌ర‌కు ముఖేష్ అంబానీ (Mukesh Ambani) టాప్ లిస్ట్ లో ఉండ‌గా, అంబానీకి, అదానీకి మ‌ధ్య తేడా చాలా స్వ‌ల్పంగా ఉన్న‌ట్టు బ్లూంబర్గ్ ఇండెక్స్ తెలియ‌జేసింది. కాగా, ఈరోజు అదానీ షేర్లు పుంజుకోవ‌డంతో అదానీ (Gautam Adani) దేశంలో అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డ్ సాధించిన‌ట్లు బ్లూంబ‌ర్గ్ ఇండెక్స్ తెలియ‌జేసింది.

గతంలో గౌతమ్ అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు కాగా ముఖేష్ అంబానీ సంపద 91 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. అయితే ఈ డేటా అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెట్టాయి. ఆరామ్‌కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజు క్షీణిస్తున్నాయి. రూ.2500కు పైకి ఉన్న రిలయన్స్ స్టాక్ ఇప్పుడు రూ.2350 దిగువకు వచ్చింది.

జియోకు తొలిసారిగా పెద్ద షాక్, ఒక్క నెలలో 1.9 కోట్ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయిన రిలయన్స్ జియో, కొత్త‌గా 2.75 ల‌క్ష‌ల యాక్టివ్ యూజ‌ర్లను సొంతం చేసుకున్న భార‌తీ ఎయిర్‌టెల్‌

క్రితం సెషన్‌లో నాలుగు శాతానికి పైగా పడిపోయిన ఈ స్టాక్, నేడు మరో 5.7 శాతం క్షీణించింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 2.94 శాతం లాభపడి 1757.70 వద్ద, అదానీ పోర్ట్స్ 4.87 శాతం ఎగిసి రూ.764.75 వద్ద, అదానీ ట్రాన్సుమిషన్ 0.50 శాతం ఎగిసి రూ.1950 వద్ద, అదానీ పవర్ స్టాక్ 0.33 శాతం లాభపడి రూ.106.25 వద్ద ట్రేడ్ అయింది. అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ మాత్రం 1 శాతం చొప్పున నష్టపోయాయి. ఇయర్ టు డేట్ (2021 జనవరి 1 నుండి ఇప్పటి వరకు) అదానీ సంపద 55 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది.

ఇదిలా ఉంటే రిల‌యన్స్ గ్రూప్ ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయిల్ వ్యాపారంతోనే వారికి క‌లిసి వ‌చ్చింది. ఆయిల్ రిఫైన‌రీస్‌తో పాటుగా రిల‌య‌న్స్ సంస్థ డిజిట‌ల్ రంగంలోకి అడుగుపెట్టిన త‌రువాత ఆదాయం మ‌రింత పెంచుకుంది. 2015 వ సంవ‌త్స‌రం నుంచి ప్ర‌తి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా కొన‌సాగుతున్నారు. ఆరేళ్ల‌పాటు ఆయ‌న ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిచారు.