Gay Couple Exchange Rings In Front Of Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతకు సుప్రీంకోర్టు నో చెప్పిన సంగతి విదితమే. సుప్రీంకోర్టు తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశ చెందారు. అయితే తాము ఇక్కడితో ఆగిపోలేదని.. మళ్లీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న అనన్య కోటియా వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టే ఇందుకు కారణం.
తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అనన్య కోటియా, అతని భాగస్వామి అయిన న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా నేడు సుప్రీంకోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఉత్కర్ష్ సక్కేనా మోకాలిపై నిలబడి ఉండి.. అనన్యకు ఉంగరాన్ని తొడిగాడు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు సమాన హక్కులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది.అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని తెలిపింది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.