కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ గట్టి షాక్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించిన కాసేపటికే గులాం నబీ ఆజాద్ ఆ పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పదవి నుంచి సైతం తప్పుకున్నారు. అనారోగ్య సమస్యలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆజాద్. తనకీ బాధ్యతలు ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆజాద్ పైకి అనారోగ్య సమస్యలని చెబుతున్నా… అధిష్టానంపై అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్‌గా పేరున్న ఆజాద్… పార్టీలో ఎన్నో సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించారు.. రెండేళ్లుగా పార్టీతో దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆజాద్ కూడా ఉన్నారు. ఆజాద్ ముఖ్య అనుచరుడు గులామ్ అహ్మద్ మిర్‌ను జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పించిన కొద్ది వ్యవధిలోనే ఆయన కూడా రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.