Global Hunger Index: ఆకలి రాజ్యం! భారదేశంలో పెరుగుతున్న ఆకలి కేకలు, ప్రపంచ ఆకలి సూచీలో 102 స్థానానికి పడిపోయిన భారత్, పాకిస్థాన్ కంటే హీనం, మెరుగైన స్థితిలో పొరుగుదేశాలు
India Ranks 102nd in Global Hunger Index | Representative Image (Photo: World Press Photo)

New Delhi, October 16:  ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్న భారతదేశం, ఆకలి సమస్యతో మాత్రం అట్టడుగు స్థానంలోకి వెళ్తుంది. ప్రపంచ కుబేరులు, అంబానీలు ఉన్న ఈ దేశంలో  ఒక పూటకు తినటానికి తిండి కూడా దొరకని వాళ్లు కూడా ఉన్నారు.  ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 45 దేశాలలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ ఆకలి సూచీ  (GHI- Global Hunger Index)లో 117 దేశాలున్న జాబితాలో భారత్ 102వ స్థానంలో అట్టడుగున చేరింది. భారత్ కంటే తన పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలు మెరుగైన ర్యాంకులలో ఉన్నాయి.

ఐర్లాండ్ కు చెందిన కన్సర్న్ వరల్డ్‌వైడ్ (Concern Worldwide) స్వచ్చంద సంస్థ మరియు జర్మనీకి చెందిన వెల్త్ హంగర్‌ హిల్ఫె (Welt hunger hilfe) సంయుక్తంగా ఆకలి సమస్యపై ప్రపంచవ్యాప్తంగా 117 దేశాలలో చేపట్టిన వార్షిక సర్వే నివేదికను వెల్లడించాయి. ఈ సందర్భంగా భారత్ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రపంచ, ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి మరియు గుర్తించడానికి రూపొందించబడిన GHI నివేదికలో ఈ ఏడాది పాకిస్తాన్ 94, బంగ్లాదేశ్ 88, నేపాల్ 73, శ్రీలంక 66 ర్యాంకులతో భారత్ కంటే ముందంజలో ఉన్నాయి.

2014లో 55వ స్థానంలో నిలిచిన భారత్, 2019కి వచ్చేసరికి 102వ స్థానానికి పడిపోయింది. 2017లో 119 దేశాలలో 100వ ర్యాంకు, మరియు 2018లో 119 దేశాలలో 103వ ర్యాంకులో భారత్ నిలిచింది. ఈ ఏడాదికి కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో 'వెల్త్ హంగర్‌ హిల్ఫె' ఆందోళన వ్యక్తం చేసింది.

GHI స్కోరు ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య మరియు పోషకాహార లోపం స్థాయిలను లెక్కిస్తుంది. భారత్ లో సగటున 6 నుంచి 23 ఏళ్ల వయసున్న పిల్లల్లో కేవలం 9.6 శాతం పిల్లలకు మాత్రమే సరైన ఆహారం అందుతుంది. పేర్కొనబడింది. పోషకాహార లోపం, వయసుకు తగిన బరువు మరియు పిల్లల మరణాలు, ఆకలి సమస్యలు తీర్చడంలో భారతదేశం పనితీరు బలహీనంగా ఉన్నట్లు నివేదికల ఆధారంగా తెలుస్తుంది.

మరుగుదొడ్ల నిర్మాణం ఉన్నప్పటికీ, బహిరంగ మలవిసర్జన జరుగుతోందని, ఇది పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది.

ఇక ఆకలి సమస్య తీర్చడానికి నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆదర్శవంతంగా ఉన్నాయని GHI నివేదిక స్పష్టం చేసింది.