New Delhi, January 16: భారత కరెన్సీ విలువ పెరగాలంటే కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి (Goddess Lakshmi) ప్రతిమను ముద్రించాలని, ఈ ప్రతిపాదనకు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని బిజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి (Subramanian Swamy) పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో 'స్వామి వివేకానంద వ్యాఖ్యమాల' అనే అంశంపై గత మంగళవారం రాత్రి ఉపన్యాసం ఇచ్చిన సుబ్రమణియన్ స్వామి అనంతరం విలేఖరులతో పలు అంశాలపై మాట్లాడారు. మాటల్లో భారత రూపాయి విలువ, ఇండో నేషియా రూపయా అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇండోనేషియన్ 20,000 రూపయ కరెన్సీ నోట్ మీద గణేషుడి ప్రతిమ ముద్రించబడి ఉంది. దీనికి సుబ్రమనియన్ జవాబు చెబుతూ 'ఆటంకాలు తొలగించే దేవుడి ప్రతిమను వారు పెట్టుకున్నారు. నన్నడిగితే మన భారతీయ కరెన్సీ నోట్లపై కూడా లక్ష్మీ దేవి ప్రతిమను ముద్రించాలి. అది మన కరెన్సీ విలువను (Indian Currency Value) పెంచేలా పనిచేస్తుంది, ఆ విషయంలో ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు.
సుబ్రమనియన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమి కొత్త కాదు, పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో సార్లు కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
పౌరసత్వ సవరణ చట్టంపై కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. గతంలో మహాత్మాగాంధీ, మరియు మన్మోహన్ సింగ్ హయాంలో కూడా పౌరసత్వ చట్టంలో సవరణలు చేయాలని కోరారు, అదే మా ప్రభుత్వం ఇప్పుడు చేసి చూపింది అన్నారు. భారతదేశ జనాభాపై విచారం వ్యక్తం చేశారు, మరో 5 ఏళ్లలో చైనాను మించిపోతున్నట్లు తెలిపారు.