Hyderabad, March 6: కరోనా సంక్షోభం సమయంలో రెక్కలు తొడిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఆ సమయంలో 10 గ్రాములకు ఏకంగా రూ. 60 వేల ఆల్ టైంహై ధరను తాకిన పసిడి, నేడు ఏడాది కనిష్ఠానికి రూ. 46 వేల దిగువకు చేరుకుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 44 వేల దిగువకు చేరే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు 'బిట్ కాయిన్' లకు డిమాండ్ పెరగడం, అలాగే యూఎస్ బాండ్లపై ఎక్కువ లాభాలు వస్తుండటం మరియు స్టాక్ మార్కెట్లు కూడా ఆశాజనకంగా ఉంటుంటడం తదితర కారణాలే బంగారం ధరలు పతనమవ్వడానికి కారణమని చెబుతున్నారు.
దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శనివారం కూడా బంగారం రేట్లు తగ్గాయి. వస్తు మార్పిడి మార్కెట్ ఎంసిఎక్స్‌లో బంగారం ధర రూ. 380 తగ్గి, 10 గ్రాములకు రూ. 45,220కు చేరుకుంది. మార్చి 6, 2021 శనివారం ఉదయం నాటి బంగారం ధరలు పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 380 తగ్గి, 10 గ్రాములకు రూ. 45,220గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 350 తగ్గి పది గ్రాములకు 41,450గా ఉంది.
విశాఖపట్నం, బెంగళూరు మరియు కేరళలో కూడా ఇవే ధరలున్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,840 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,630, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,430 మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,430గా ఉన్నాయి.
దేశంలో వెండి ధరలు కూడా పతనం అయ్యాయి, కిలో వెండి ధరలు 68 వేల దిగువకు చేరుకున్నాయి. కేరళలో కిలో వెండి శనివారం ఉదయం నాటి ధర రూ. 65,420గా ఉంది.