New Delhi, Mar 14: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి కరోనా దెబ్బకు ప్రతీ రంగం కుదేలవుతోంది. ఒక డిపార్ట్ మెంట్ అని లేకుండా అన్ని డిపార్ట్ మెంట్ల మీద దీని ప్రభావం పడింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అయితే కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని ప్రభావం కీలక రంగమైన చమురు రంగంపై కూడా పడింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మార్కెట్లను కుదిపేస్తున్న కరోనావైరస్ భయం
కోవిడ్-19 అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న వేళ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున సుంకాన్ని పెంచినట్లు పేర్కొంది. అదే విధంగా పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 నుంచి 8 రూపాయలకు, డీజిల్‌పై రూ.4కు పెంచుతున్నట్లు ప్రకటనలో తెలిపింది. దీంతో పాటుగా రోడ్ సెస్‌ను కూడా పెంచినట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌పై వరుసగా లీటరుకు రూ.1, రూ. 10 వరకు రోడ్ సెస్‌ను పెంచింది.
అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న వేళ.. కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉన్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచిన నేపథ్యంలో ఇంధన ధరలు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం రావొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.