Nikita Jacob (Photo Credits: Twitter)

New Delhi, February 15: రైతుల ఉద్యమానికి మద్దతుగా ట్విట్టర్లో పలువురు సెలబ్రీటీలు చేసిన ట్వీట్లపై కేంద్రం సీరియస్ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టూల్ కిట్ కేసులో (Greta Thunberg 'Toolkit' Case) ఇవాళ ఢిల్లీ పోలీసులు ఇద్ద‌రికి నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు. లాయర్ నికితా జాక‌బ్‌ (Mumbai-Based Lawyer Nikita Jacob), షంత‌న్‌ల‌పై ఆ వారెంట్లు జారీ అయ్యాయి. ఆ ఇద్ద‌రూ టూల్ కిట్ వివాదంలో ఉన్న‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ ఈ టూల్‌కిట్‌ను (Toolkit) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రైతుల ఆందోళ‌న‌కు (Farmers Protest) మ‌ద్ద‌తు తెలిపింది. టూల్ కిట్ అంటే సోష‌ల్ మీడియాలో ఓ డాక్యుమెంట్‌.

ఆ టూల్ కిట్‌ను బ‌ట్టే.. ఇండియా బ‌య‌ట కూడా దేశానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింద‌ని, అందులో ట్విట‌ర్ కీల‌క పాత్ర పోషించింద‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ కేసులోనూ బెంగుళూరుకు చెందిన దిశ ర‌వి అనే యువ కార్య‌క‌ర్త‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కాగా లాయ‌ర్ నికితా జాక‌బ్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. ఆమె అరెస్టు కోసం పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. రైతు ఉద్య‌మాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసేందుకు నికితా జాక‌బ్‌తో పాటు ఇత‌రులు జూమ్‌లో మీటింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసులు విచార‌ణ‌లో తేల్చారు.

రైతుల ఉద్యమంలో హింస, బెంగళూరు మువతిని అరెస్ట్ చేసిన పోలీసులు, టూల్‌కిట్‌ను థ‌న్‌బ‌ర్గ్‌కు పంపించింది దిశానే అన్న ఆరోప‌ణ‌లు

ఇదిలా ఉంటే పర్యావరణ కార్యకర్త దిశ రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. రైతుల ఆందోళనలపై ‘టూల్‌కిట్‌’ రూపొందించిన కేసులో ఆమెను అరెస్ట్‌ చేయడంపై రైతులు మండిపడ్డారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఒక ఖండన ప్రకటనను సోమవారం విడుదల చేసింది.

రైతుల ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో ప్రభుత్వం పోలీసుల అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతున్నది. యువ పర్యావరణ కార్యకర్త దిశ రవిని సరైన విధానాలు పాటించకుండా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నది. ఆమెను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తున్నది’ అని పేర్కొంది. అంతేగాక ఈ నెల 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటలపాటు రైల్‌ రోకోకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కూడా దిశ అరెస్ట్‌ను ఖండించింది. రైతుల ఉద్యమానికి భయపడిన మోడీ ప్రభుత్వం 21 ఏండ్ల యువతిని అరెస్టు చేయడం ద్వారా మానవాళిని చంపుతున్నదని విమర్శించింది. ఢిల్లీలో జనవరి 26న జరిగిన హింసాకాండను నివేదించిన పలువురు జర్నలిస్టులపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలని కేఎస్ఎంసీ డిమాండ్‌ చేసింది.