Bharuch Hospital Fire: మంటల్లో కాలిపోయిన 18 మంది కరోనా పేషెంట్లు, గుజరాత్ భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన భారుచ్‌ ఎస్పీ రాజేంద్ర సింహ్‌
Gujarat Hospital Fire. (Photo Credits: ANI | Twitter)

Bharuch, May 1: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం (Gujarat Hospital fire) జరిగింది. ఈ ఘటనలో 18 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. కాగా కొవిడ్‌ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకొని, భారీగా వ్యాపించిన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారని భారుచ్‌ ఎస్పీ రాజేంద్ర సింహ్‌ తెలిపారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు.

భారుచ్‌-జంబుసర్‌ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలో హాస్పిటల్‌ ఉండగా.. ఈ ఆస్పత్రిని ఓ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కొవిడ్‌ వార్డులో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మంటలు (Bharuch Covid Hospital Fire) చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్‌ సంసియా తెలిపారు.

గంటలోపు మంటలు అదుపులోకి తీసుకువచ్చామని, సుమారు 50 మంది రోగులను, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని పేర్కొన్నారు. వారందరినీ సమీపంలో ఉన్న హాస్పిటల్స్‌కు తరలించినట్లు వివరించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పి.ఎం.నరేంద్ర మోడీ, సీఎం విజయ్ రూపానీ సంతాపం

భరూచ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన రోగుల మరణానికి ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంతాపం తెలిపారు, “భరూచ్ లోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు, మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని ప్రకటించారు.