Gujarat Rains Live Updates, IMD issues red alert, Patna 76 government schools closed due to rise in Ganga water level

Hyd, Aug 28:  భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. ఎడతెరపి లేని వర్షాలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంతరాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేయగా తూర్పు రాజస్థాన్ నుండి సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆగస్టు 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. గుజరాత్‌ను ‘ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్’ జోన్‌గా ప్రకటించింది ఐఎండీ.

భారీ వర్షాలతో వడోదర సహా పలు జిల్లాలు నీటిమయం కావడంతో వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో

వల్సాడ్, తాపి, నవ్ సారి, సూరత్, నర్మద, పంచ్ మహాల్ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మోర్బీ జిల్లాలో నదిపై నిర్మించిన కాజ్ వే వరద నీటిలో మునగడంతో, ఆ మార్గంలో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ నీటిలో కొట్టుకుపోయింది. నర్మద, సౌరాష్ట్ర, రాజ్ కోట్, తాపి, మహిసాగర్, మోర్బీ, దాహోద్, వడోదర జిల్లాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురిసింది.

Here's Video:

 ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు దీనికి తోడు సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఆగస్టు 30 వరకు గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడగా , లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వర్షాలకు కార్లు నీట మునగగా మరికొన్ని చోట్ల కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పంటలకు భారీ నష్టం వాటిల్లగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడొద్దదని అధికారులు హెచ్చరించారు. గుజరాత్‌లోని పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది కేంద్రం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Here's Video:

 సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని నర్మదా నదిలోకి విడుదల చేయడంతో దాదాపు 280 మందిని గుజరాత్‌లోని భరూచ్ నగరంలో లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్‌లో వరద ప్రవాహానికి పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి.

బీహార్ రాజధాని పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గంగా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలోని ఎనిమిది బ్లాకుల్లో మొత్తం 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నాం అని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Here's Video: