![](https://test1.latestly.com/wp-content/uploads/2020/02/Death-Penalty-Hanging-380x214.jpg)
New Delhi, Feb 7: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న (Farmers Protest) సంగతి విదితమే. కేంద్రానికి అక్టోబర్ 2 వరకు డెడ్ లైన్ విధించారు. అయితే కేంద్రం నుంచి స్పందన అంతంత మాత్రమే ఉండటంతో రైతులు కలత చెందుతున్నారు. తాజాగా రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీకి సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని (Haryana Farmer’s Body Found Hanging) చనిపోయాడు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జింద్ గ్రామానికి చెందిన 52 ఏండ్ల కరమ్‌వీర్‌సింగ్ కొన్ని రోజులుగా టిక్రీ ప్రాంతంలోనే ఉంటున్నాడు. గత 74 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందిన ఆయన స్థానిక బైపాస్‌లోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో (Tikri Border Protest Site) చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సివిల్ దవాఖానకు తరలించారు.
అనంతరం జింద్ గ్రామంలోని ఆయన కుటుంబీకులకు సమాచారం అందించారు. రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంతో కరమ్‌వీర్ సింగ్ కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారని, ఈ విషయాన్ని సూసైడ్ నోట్‌లో కూడా స్పష్టం చేసినట్లు అక్కడి రైతులు తెలిపారు. కరమ్‌వీర్ సంగ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, మోఘా జిల్లాలోని ధుర్కోట్ రాసిన్ ప్రాంతానికి చెందిన 60 ఏండ్ల వయసున్న దిలీప్‌సింగ్ కూడా ఇటీవలనే చనిపోయి కనిపించాడు. ఆయన మృతదేహాన్ని బహదూర్‌గఢ్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
ఆ తర్వాత పంజాబ్ సంగ్రూర్ జిల్లాలోని లోధి గ్రామానికి చెందిన బాజ్ సింగ్ కుమారుడు 70 ఏండ్ల లఖా సింగ్ కూడా ఇటీవలనే ఉద్యమ ప్రాంతంలో గుర్తుతెలియని కారణంతో చనిపోయాడు. రైతుల ఆందోళన మొదలైనప్పటి నుంచి చనిపోయిన రైతుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే మొత్తం మరణించిన వారి సంఖ్య 33 కు పెరిగింది.