New Delhi, October 11: హత్రాస్ కేసులో లక్నో బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలొ ఎట్టకేలకు సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించింది. హత్రాస్ హత్యాచార కేసు (Hathras Case) దర్యాప్తు చేపట్టిన సీబీఐ నిందితుడిపై కేసు నమోదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం (UP Govt) విజ్ఞప్తి మేరకు హత్రాస్ కేసు దర్యాప్తును (Hathras gangrape case) యూపీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సందీప్ పై సెక్షన్ 307, 376 డీ, 302, ఎస్సీ / ఎస్టీ చట్టంపై సెక్షన్ 3 కింద కేసును సీబీఐ ఆదివారం నమోదు చేసింది. ఈ కేసుపై లక్నో యూనిట్ ఘజియాబాద్ బృందం దర్యాప్తు చేస్తున్నది. పోలీసుల నుంచి అన్ని పత్రాలను సీబీఐ (CBI) స్వాధీనం చేసుకోనున్నది.
అక్టోబర్ 3 న సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్ అవస్థీ, డీజీసీ హితేష్ చంద్ర .. హత్రాస్‌కు చేరుకుని బాధితురాలి కుటుంబాన్ని కలిశారు. అనంతరం వీరు సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని సీఎంకు నివేదించారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సోమవారం విచారించనున్నది. ఈ కేసులో యూపీ ఉన్నతాధికారులతో పాటు హత్రాస్‌కు చెందిన డీఎం, ఎస్పీలకు హైకోర్టు సమన్లు పంపింది.
బాధితుడి కుటుంబం కూడా రేపటి విచారణకు హాజరుకానున్నారు. బాధితుడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులను కట్టుదిట్టమైన భద్రత మధ్య సాక్ష్యమిచ్చేందుకు తీసుకురానున్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరపున వినోద్ షాహి వాదించనున్నారు. కుటుంబంలోని మహిళా సభ్యులకు మహిళా భద్రతా సిబ్బందిని నియమించారు. ఇవాళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో బాధితురాలి కుటుంబం కలిసి చర్చించాలని అనుకున్నారు. అయితే అది ఇంకా ధ్రువీకరణ కాలేదు.
సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. దుండగులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రంగా హింసించిన‍్నట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూశారు.
ఇక హత్రాస్ ఘటన యూపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసు పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బాధితురాలి కుటుంబం పట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి అర్ధరాత్రి ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం దుమారం రేపింది
ఇదిలా ఉంటే పోకిరీలు, సంఘ వ్యతిరేక శక్తుల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు మరో విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అక్కడి పోలీసు శాఖ నిర్వహిస్తున్న యాంటీ రోమియో స్క్వాడ్‌కు తోడు షేర్నీ(ఆడసింహాలు) పేరిట మరో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల ఈ స్క్వాడ్‌ను ప్రారంభించారు. ఇందులోని సభ్యులు షాపింగ్ మాల్స్, మార్కెట్లు, ప్రార్థనాస్థలాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో పహారా కాస్తూ పోకీరీలకు చెక్ పెట్టనున్నారు. ‘షేర్నీ’ పోలీసుల కోసం వీలైనంత త్వరగా డ్యూటీ చార్ట్ రూపొందించాలని ఎస్ఎస్‌పీ జోగిందర్ యాదవ్ పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ బృందంలో భాగమయ్యే అధికారులకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. మహిళాలకు భద్రత ఎలా కల్పించాలనే అంశంతో పాటూ, ఈ విషయంలో చట్టపరంగా వారికున్న అధికారాలు, పరిమితులపై కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. వీటితోపాటూ శారీరక దారుఢ్యం పెంచే ప్రత్యేక శిక్షణ కూడా ఈ బృందంలోని సభ్యులు తీసుకుంటారు. ఉదయం 10 నుంచి రాత్రి 8.30 వరకూ వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు.