Hatras, July 03: బోలే బాబా.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో (Hathras Stampede) ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా బోలే బాబా పేరు మారుమోగుతోంది. ఎవరీ బోలే బాబా? (Bhole Baba) ఆయన నేపథ్యం ఏంటి? ఎలా పాపులర్ అయ్యారు? అనేది తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. హత్రాస్ లో (Bhole Baba) ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించింది ఈ బోలే బాబానే. బోలే బాబా గతంలో పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేశారు. 18 ఏళ్లు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత పోలీస్ ఉద్యోగం వదిలేసి కొత్త అవతారం ఎత్తారు. బాబాగా మారారు. మత బోధకుడు అయ్యారు. ఉపన్యాసాలు, సత్సంగాలు ఇవ్వడం ప్రారంభించారు. ‘నారాయణ్ సకార్ హరి’ (Narayan Sahakari) అని సంబోధించడానికి ఇష్టపడే బాబా, క్రమంగా ప్రాచుర్యం పొందారు. వేలాది మంది ఆయనకు అనుచరులుగా మారారు.
కాస్ ఘంజ్ జిల్లా అలీఘర్ డివిజన్ లోని గ్రామానికి చెందిన బోలే బాబా ‘సకర్ విశ్వ హరి బాబా’గా ప్రసిద్ధి చెందారు. కేవలం తెల్లని దుస్తులు మాత్రమే ధరిస్తారు. ప్రసంగాలలో ఆయన తన భార్యతో కలిసి కనిపిస్తారు. బాబా అనుచరులు ఎక్కువగా బ్రజ్ ప్రాంతంలోని ఆగ్రా, అలీఘర్ డివిజన్‌లకు చెందిన వారు.
బోలే బాబాకు ఫేస్‌బుక్‌లో 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని సమాచారం. మంగళవారం ఆయన నిర్వహించిన సత్సంగానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. బాబా మనుషులు గులాబీ రంగు దుస్తులు, తెల్లటి టోపీలు ధరించి కనిపిస్తారు.