Health Ministry notice to 15 websites for selling e-cigarettes: నిషేధిత ఈ-సిగరెట్ల అమ్మకాలు నిలిపేయాలంటూ 15 వెబ్‌సైట్లకు కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health Ministry) నోటీసులు జారీ చేసింది. ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను నిలిపేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరో ఆరు వెబ్‌సైట్‌లు కూడా కేంద్రం పర్యవేక్షణలో ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ-సిగరెట్ల ప్రకటనలు, అమ్మకాలను కూడా మంత్రిత్వశాఖ నిశితంగా పరిశీలిస్తోందని, త్వరలో వారికీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి.
భారత్‌లో 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. దీని కింద ఈ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకాలు, పంపిణీ, నిల్వ, ప్రకటనలపై నిషేధం ఉంది. ఈ-సిగరెట్లపై నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.