Hyderabad, September 18: ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని ఆనుకొని నైరుతి దిశగా పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావం తెలంగాణ, మహారాష్ట్రపై కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం నుంచి వర్షపాతం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపిలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెపుతుంది. రాయలసీమ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
ఈ ఆవర్తనం మరింత బలపడి తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అండమాన్ మరియు నికోబార్ దీవుల నుంచి ఒడిశా వైపుగా ఈ గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.