Heavy Rains HIt Tamil Nadu 15-dead-tn-s-mettupalayam-houses-collapse-due-heavy-rain (Photo-ANI)

Chennai, December 2: తమిళనాడు(Tamil Nadu)ను భారీ వర్షాలు(Heavy Rains HIt Tamil Nadu) వణికిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. భారీ వర్షాలకు తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నాలుగు భవనాలు కూలి (Four houses collapsed)15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మంది మృతి చెందారన్నదానిపై ఇంకాఅధికారిక సమాచారం లేదు.

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షం బీభత్సంగా కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. నిన్న 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సె.మీకి పైగానే వర్షం కురిసింది. మరో రెండు రోజులు వర్షం కొనసాగనుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

ANI Tweet

తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు పడ్డాయి. తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై , నాగపట్నం , శివగంగై జిల్లాల్లో మోస్తరుగా వర్షం పడుతోంది.

సహాయక చర్యలు ముమ్మరం

తూత్తుకుడి జిల్లాలో వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కి ఉన్నాయి. వేలాది ఇళ్లల్లోకి నీళ్లు చొరబడడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరంచేసింది. తూత్తుకుడి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసివేయాల్సినంతగా పరిస్థితి మారింది. ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించని రీతిలో నీళ్లు ఇక్కడ చుట్టుముట్టాయి.

మరో రెండు రోజులు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం(Indian Meteorological Department) ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. భారీ వర్షాల రూపంలో పెను విపత్తు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్ని మరింత విస్తృతం చేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే, సోమవారం సచివాలయంలో సీఎం పళనిస్వామి(Tamil Nadu Chief Minister Edappadi Palaniswami) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.

ఇక, వర్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ వర్గాలు సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని, బాధితులకు అండగా నిలవాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

వర్షం కారణంగా చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వైపుగా వెళ్లాల్సిన అనేక విమానాలు టేకాఫ్‌ చేసుకునేందుకు ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో కాస్త ఆలస్యంగా ఈ విమానాలు బయలుదేరాయి. అలాగే, సింగపూర్, దోహా, దుబాయ్, బక్రెయిన్‌లకు బయలుదేరాల్సిన విమానాలు గంటన్నర ఆలస్యంగా టేకాఫ్‌ చేసుకున్నాయి.