New Delhi, Mar 17: కర్ణాటకలో వివాదాల్సదంగా మారిన హిజాబ్ వ్యవహారంపై (Hijab Ban) కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును (Karnataka high court verdict) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హోలీ పండుగ సెలవుల తర్వాత ( Holi vacation) విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది.
రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు.
కాగా కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై విచారణ జరుగుతున్న సమయంలోనే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే నాడు ఈ పిటిషన్‌ను తీరస్కరించిన సుప్రీంకోర్టు.. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాను విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి ఉంటే అప్పుడు తమను ఆశ్రయించవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు