Bengaluru, February 8: కర్ణాటకలో హిజాబ్(బురఖా) గొడవ మరింతగా ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్ (Karnataka Hijab Row) ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు.
హిజాబ్ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా (Hijab Row Turns Violent As Stone Pelting) వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు.
రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్‌లో స్పందించారు.
ఇక హిజాబ్ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలోని రెండు జిల్లాల్లో మంగళవారం హింసాత్మకంగా మారింది. ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్‌లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి. హిజాబ్ ధరించి ఓ విద్యార్థిని కాలేజ్‌కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు.
యువతి తన స్కూటర్‌ను పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించిన వర్గం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
A more expanded and clean feed of the above episode. #KarnatakaHijabRow pic.twitter.com/TIieUQJUWN
— Imran Khan (@KeypadGuerilla) February 8, 2022
దీనిపై విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్ ధరించిన వారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్‌కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో కొందరు విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్ అంటూ నినదించారు.