Shimla, August 21: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh Rains) అతలాకుతలం అవుతోంది. మండి, కంగ్రా, చంబా జిల్లాల్లోని ముంచెత్తిన వరదల్లో 22 మంది మరణించారు. మరో అయిదుగురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh Floods) కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో నదులు పొంగిపొరలుతున్నాయి.
శనివారం ఉదయం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ పఠాన్‌కోటలోని చక్కి నది మీద నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన కుప్పకూలిపోయింది. జోగిందర్ నగర్, పఠాన్‌కోట్ మధ్య ఈ వంతెనను బ్రిటిష్ హయాంలో 1928లో నిర్మించారు.చంబా జిల్లాలో కొండచరియలు ఇళ్ల మీద విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండిలో వరదలకు ఒకే కుటుంబంలోని అయిదుగురు కొట్టుకుపోయారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందిస్తున్నట్టుగా తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లతో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తెహ్రి జిల్లాలో ఇళ్లు కూలిపోయి నలుగురు మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు. రిషికేష్ గంగా నది ఉప్పొంగుతోంది. టాన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తపకేశ్వర్ గుహలను వరద నీరు ముంచెత్తింది.రాయపూర్‌లోని సార్కేత్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో థానో ప్రాంతంలోని సాంగ్ నదిపై వంతెన కూలిపోయింది. ముస్సోరి సమీపంలో పర్యాటకప్రాంతమైన కెంప్టీ జలపాతం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. అవసరమైతే ఆర్మీ సాయం కోరతామని వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. తెహ్రీ జిల్లాలో ఇంటి గోడ కూలడంతో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. పౌరీ జిల్లా యంకేశ్వర్‌లోనూ గోడ కూలిన ఘటనలో మహిళ మృతి చెందింది. తెహ్రీ జిల్లా కీర్తినగర్‌లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కొండ చరియలు విరిగి పడటంతో 235 రోడ్లు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రియాసీ జిల్లా తాల్వరా ప్రాంతంలో పలు ఇండ్లు దెబ్బ తిన్నాయి. బంగాళాఖాతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్‌ల్లో మీదుగా అల్ప పీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీన పడవచ్చునని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్‌ల్లో మీదుగా అల్ప పీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీన పడవచ్చునని భారత వాతావరణ విభాగం తెలిపింది.