Howrah, FEB 02: భర్తను బురిడీ కొట్టించిన భార్య అతడి కిడ్నీని అమ్మింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త షాక్ అయ్యాడు. (Wife Sells Husband Kidney, Elopes With Lover ) పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంక్రైల్ ప్రాంతానికి చెందిన మహిళ ఇంటి ఆర్థిక ఇబ్బందులు, కుమార్తె భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఒక ప్లాన్ వేసింది. ఆరోగ్యం కోసం వైద్య చికిత్స అవసరమని భర్తను నమ్మించింది. రహస్యంగా అతడికి సర్జరీ చేయించింది. భర్తను బురిడీ కొట్టించి అతడి కిడ్నీని పది లక్షలకు అమ్మింది. ఆ డబ్బును బ్యాంకులో జమ చేస్తానని భర్తకు చెప్పింది. రాత్రికి రాత్రే ఆ డబ్బు తీసుకుని కుమార్తెతో పాటు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.
కాగా, భార్య, కుమార్తెతో పాటు డబ్బు కనిపించకపోవడంతో భర్త షాక్ అయ్యాడు. ఆమె కోసం వెతకగా బరాక్‌పూర్ ప్రాంతంలో ప్రియుడైన పెయింటర్‌తో కలిసి ఆమె నివసిస్తున్నట్లు తెలుసుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమెను నిలదీశాడు. అయితే ఇంటికి తిరిగి రానని భార్య తెగేసి చెప్పింది. అలాగే విడాకుల పత్రాలు పంపుతానని బెదిరించింది. దీంతో భార్య తనను మోసగించినట్లు తెలుసుకున్న భర్త ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.