Illegal constructions near Krishna Janmabhoomi: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి(Krishna Janmabhoomi) సమీపంలో నాయి బస్తీలో రైల్వే శాఖ అక్రమ నిర్మాణాలను తొలిగిస్తోంది.రైల్వే అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతల (Demolition Drive)పై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక ఆదేశాలు వెలువరించింది. పది రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా రైల్వే (Railway) శాఖను ఆదేశించింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
66 ఏళ్ల యాకుబ్ షా వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బస్తీ ప్రాంతంలో తమ కుటుంబాలు 1880 నుంచి నివసిస్తున్నట్లు పిటీషన్‌లో తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి రైల్వేశాఖ తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఈ కేసులో వచ్చే వారం మళ్లీ వాదనలు కొనసాగనున్నాయి. షా తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంతో చంద్ర సేన్ వాదిస్తున్నారు. కౌశిక్ చౌదరీ, రాధా తార్కర్, ఆరన్ షాలు అడ్వకేట్లుగా ఉన్నారు. స్థానిక సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. షా మాత్రం సుప్రీంను ఆశ్రయించారు.
ఇక వందేభారత్ లాంటి అధునాతన రైల్వేల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు 21 కి.మీల స్ట్రెచ్‌ను నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణ జన్మభూమి వెనుకవైపు ఉన్న నయీ బస్తీలో ఇప్పటివరకు 135 ఇళ్లను కూల్చివేశారు.అయితే, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపించిన బస్తీవాసులు దీనిపై కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా.. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరపనుంది.