Chennai, Nov 2: రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో బుధవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో గురువారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఇక మంగళవారం అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 13 సెం.మీ., అనంతపురం జిల్లా కనేకల్‌లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా మల్లంలో 7.9, వాకాడులో 5.7, పూలతోటలో 4.1, గునుపూడులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఓ వైపు ఈశాన్యరుతుపవనాల ప్రభావం, మరో వైపు నైరుతి బంగాళాఖాతం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో చెన్నై(Chennai), శివారు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా జనజీవనం స్తంభించింది. వర్షాలకు ఇద్దరు దుర్మరణం చెందారు. దీంతో చెన్నై(Chennai) సహా 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షానికి నగరంలో పలు చోట్ల చెట్లు కూలిపడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సోమవారం సాయంత్రం చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం రాత్రి 8 గంటలకు ఉధృతమైంది.
ఉరుములు మెరుపులతో భారీ వర్షం(Heavy rain) కురిసి నగరంలోని పల్లపు ప్రాంతాలను దీవులుగా మార్చింది. సుమారు రెండు గంటలపాటు వర్షం కురవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేపాక్, ట్రిప్లికేన్, రాయపేట, మందవెల్లి, రాజా అన్నామలైపురం, సైదాపేట, వేప్పేరి, ఫ్లవర్‌బజార్, పులియంతోపు, పెరంబూరు, కొడుంగయూరు, అన్నానగర్, చూళైమేడు, వడపళని, కోయంబేడు, వలసరవాక్కం, మధురవాయల్, కేకే నగర్, గిండీ తదితర ప్రాంతాల్లోని రహదారులపై వర్షపునీరు వరదలా ప్రవహించింది. పులియంతోపు, పట్టాలం, రాయపేట(Rayapeta) ఆసుపత్రి ప్రాంతం, రాయపురం రాజగోపాలపురం వీధి, ఓల్డ్ వాషర్‌మెన్‌పేట, పెరంబూరు సబ్‌వే తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
భారీ వర్షానికి నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం ఉదయం కూడా జోరుగా వర్షం కురవటంతో నగరవాసులు అవస్థలపాలయ్యారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరంతా రహదారులపై వరదలా ప్రవహించింది. వాహనచోదకులంతా రమదారులలో వాననీటిలోనే వాహనాలను నడిపేందుకు అవస్థలు పడ్డారు.
ద్విచక్రవాహనాలు రెండడుగుల మేర వర్షపునీటిలో కదలకుండా మొరాయించాయి. దీంతో వాహనాలను అతికష్టం మీద నెట్టుకుంటూ వెళ్ళారు. ఈ వర్షం కారణంగా ఉద్యోగులు, కార్మికులు సకాలంలో విధులకు హాజరుకాలేకపోయారు. శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ ప్రాంతంలో 12.,7 సెం.మీ.ల వర్షపాతం, పెరంబూరులో 12. సెం.మీలు, మీనంబాక్కంలో 7 సెం.మీల వర్షపాతం, నాగర్‌కోవిల్‌లో 2 సెంమీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.