India- China Border Row: భారత్ - చైనా సరిహద్దు వివాదం..  బలగాలను ఉపసంహరించుకుంటున్న చైనా; ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కీ బాత్' లో  ప్రధాని మోదీ ప్రసంగం
Indian and Chinese Troops | Representational Image | (Photo Credits: IANS)

New Delhi, July 25:  సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో భారత్- చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఇరు దేశాలకు చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల ఫలితంగా తూర్పు లడఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 14, 15 మరియు 17ఎ వద్ద  చైనా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

పంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో కూడా బలగాలను ఉపసంహరించుకునే దిశగా మరింత కృషి చేయడానికి రాబోయే వారం రోజుల్లో ఇరు దేశాలకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని వార్తా సంస్థ ANI నివేదించింది. సైనిక మరియు దౌత్య స్థాయిలో  ఈ చర్చలు జరుగుతున్నాయని వార్తా సంస్థ పేర్కొంది.

తూర్పు లడఖ్‌లో మోహరించిన ఇరు దేశాలకు చెందిన దళాలను "వెంటనే మరియు పూర్తిగా" ఉపసంహరించుకోవాలని భారత్ మరియు చైనా శుక్రవారం రోజున ఏకాభ్రియానికి వచ్చాయి, ఆ మరుసటి రోజే ఈ అభివృద్ధి జరిగింది. సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించే దిశగా "త్వరితగతిన" బలగాలను పూర్తి స్థాయిలో వెనక్కి తరలించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి, త్వరలోనే ఇరు దేశాలకు చెందిన ఆర్మీ కమాండర్లతో సమావేశం జరిగే వీలుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.

Here's the update:

సరిహద్దు వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇండియా- చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి మొన్న శుక్రవారం రోజున 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ' (WMCC) సుదీర్ఘమైన చర్చలు జరిపింది.

అంతకుముందు జూలై 5న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి దాదాపు రెండు గంటల టెలిఫోన్ సంభాషణను నిర్వహించారు. ఇలా వరుస చర్చలు, సమావేశాలు, సంభాషణల అనంతరం పరిస్థితులు మెల్లిమెల్లిగా చక్కబడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని ఇండియా- చైనా అంశంపై ఏదైనా ప్రకటన చేస్తారో, లేదో చూడాలి.