International Flights Suspension: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు, మరో నెలపాటు  పొడగిస్తున్నట్లు తాజాగా సర్క్యులర్ జారీ చేసిన డీజీసీఎ
Flight - Representational Image | File Photo

New Delhi, April 30: అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని (International Flights Suspension) కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. మే 31, 2021 వరకు అంతర్జాతీయ వాణిజ్య విమాన కార్యకలాపాల సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్లు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. అయితే, విమాన ప్రయాణ బబుల్ ఏర్పాట్ల కింద మాత్రం అంతర్జాతీయ ప్రయాణీకులకు సర్వీసులు కొనసాగుతాయి. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

గతేడాది 26-06-2020 నాటి సర్క్యులర్ లోనే పాక్షిక సవరణలు చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా భార‌త పౌర‌విమాన‌యాన శాఖ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని విడ‌త‌ల వారీగా పొడిగించడం, ఆంక్షలు విధించడం చేస్తూ వస్తుంది. చివ‌రిసారిగా ఏప్రిల్ 30 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించింది. శుక్ర‌వారం నాటికి ఆ గడువు కూడా ముగియ‌డంతో మ‌రో నెల రోజుల‌పాటు నిషేధాన్ని పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది.

అయితే, అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ ప్యాసెంజ‌ర్ ఫ్లైట్ల‌కు మాత్ర‌మే ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని,  అంత‌ర్జాతీయ కార్గో ఆప‌రేష‌న్స్‌ మరియు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అనుమ‌తితో న‌డుస్తున్న ప్ర‌త్యేక విమానాల‌కు ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టంచేసింది.

Here's the update:

శుక్రవారం ఉదయం నాటికి భారత్ లో కొత్తగా మరో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,87,62,976కు చేరింది. నిన్న ఒక్కరోజే 3,495 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,08,330 కు పెరిగింది.