COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, March 18: భారత్‌లో కోవిడ్19 కేసులు క్రమేణా పెరుగుతున్నాయి, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా రెండో దశలోకి ప్రవేశించింది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స సామర్థ్యం పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. అదేవిధంగా ప్రజలు గుంపులుగా తిరగకుండా చూడాలని, మాస్కులు వేసుకోవడంతో పాటు ఇతర అన్ని కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 35,871 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో గత 102 రోజుల్లో అత్యధికంగా బుధవారం 35,886 కేసులు రాగా, నేడు కూడా ఇంచుమించు అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల్లో 64 శాతం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి.  ఒక్క మహారాష్ట్రలోనే గడిచిన ఒక్కరోజులో 23,179 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి  1,14,74,605కు చేరింది. నిన్న ఒక్కరోజే 172 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,59,216 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,741 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,10,63,025 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,52,364 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.41 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.20 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.39% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 17 వరకు దేశవ్యాప్తంగా 23,03,13,163 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,63,379 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 3.7 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం 3,71,43,255 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.