COVID19 in India: దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో సుమారు 10 వేల కేసులు నమోదు, భారత్‌లో 2,46,628 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య,  7 వేలకు చేరువలో కరోనా మరణాలు
COVID 19 Outbreak in India| (Photo Credits: IANS)

New Delhi, June 7:  భారతదేశంలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తుంది. దేశంలో ఒకరోజుని మించి ఒకరోజు కేసులు నమోదవుతుండటమే ఇందుకు ఉదాహరణ. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9,971 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 2,46,628 కు చేరింది. నిన్న ఒక్కరోజే 287 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 6929 కు పెరిగింది.

నిన్న దేశవ్యాప్తంగా 5,220 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,19,292 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,20,406 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

#COVID19 India Report:

#COVID19 India Update:

ఎప్పట్లాగే మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. శనివారం నాటికే మహారాష్ట్రలో పాజిటివ్ గా నిర్ధారింపబడిన కేసుల సంఖ్య 82,968 కు చేరుకుంది. శుక్రవారం ఒకే రోజులోనే 120 మంది కోవిడ్ బాధితులు మరణించగా, కొత్తగా మరో 2,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర కరోనా మరణాల సంఖ్య శనివారం ఉదయం నాటికి 2,969 పెరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తాజాగా రిపోర్ట్ చేయబడిన పాజిటివ్ కేసులతో భారత్, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో స్పెయిన్ దేశాన్ని నెట్టేసి 5వ స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, రష్యా మరియు యూకే తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.