New Delhi, Feb 14: దేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus) అయింది. అదే సమయంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 92 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,11,731 మంది కోలుకున్నారు. 1,37,567 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 82,63,858 మందికి వ్యాక్సిన్ వేశారు.
ఏపీలో గత 24 గంటల్లో 33,415 నమూనాలు పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్ (Andhra pradesh Coronavirus) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు గుర్తించారు. అనంతపురం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా 8,88,814 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,855 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గి 797కి చేరింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,162గా నమోదైంది.
తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు (Telangana Covid) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 177 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,574 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,210 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,616 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,748 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ వ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత హైదరాబాద్ కు (Hyderabad) చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు వైరస్ బారిన పడటం కలకలం రేపింది. నిమ్స్ కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్ కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్ ను తీసుకున్నారు. కాగా, ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. టీకా తీసుకున్న తరువాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వారిద్దరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.
కాగా, ఇండియాలో వ్యాక్సినేషన్ (Vaccination in India) గత నెల 16న ప్రారంభం కాగా, రెండో డోస్ ఇవ్వడం ఇప్పుడే మొదలైంది. అయితే, రెండు డోస్ లనూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తరువాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తొలి టీకా తీసుకోగానే నిబంధనలను పాటించడం లేదని, అందువల్లే ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ఇండియాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2019 డిసెంబర్ లో వూహాన్ నగరంలో కరోనా వైరస్ (Wuhan Coronavirus) తొలుత బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ ను తొలుత గుర్తించిన 174 పేషెంట్లకు చెందిన రా డేటాను ఇవ్వాలని చైనాను డబ్యూహెచ్ఓ టీమ్ కోరింది. అయితే పూర్తి డేటాను చైనా ఇవ్వలేదని, కేవలం దానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే అందించిందని టీమ్ లో సభ్యుడైన ఆస్ట్రేలియాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డోమినిక్ డ్వేయర్ తెలిపారు. వైరస్ పుట్టుకను కనిపెట్టేందు పేషెంట్ల రా డేటా చాలా అవసరమని ఆయన చెప్పారు. అయితే ఆ డేటాను చైనా ఎందుకు ఇవ్వలేదనే విషయంపై తాను మాట్లాడలేనని అన్నారు. రాజకీయ కారణాల వల్ల ఇవ్వలేదా? లేదా ఇది సరైన సమయం కాదా? లేదా ఇవ్వడం కష్టమా? కారణం ఏమిటనేది తనకు తెలియదని చెప్పారు.