Shimla, Feb 13: ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో అక్కడక్కడా కొన్ని నిరాశాకర వార్తలు బయటకు వస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ అక్కడక్కడా కొత్త కేసులు నమోదవుతున్న సంఘటనలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి పాజిటివ్ రాగా.. మరికొందరు వ్యాక్సిన్ వేసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ తో మరణించారు. అయితే సిమ్లాలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.ఈ కథనాన్ని ఇండియా టుడే ప్రచురించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో (Indira Gandhi Medical College) వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో వైద్యులైన భార్యభర్తలు కూడా ఉన్నారు. వారు 10 రోజుల కిందటే వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. అయితే వారికి ఇంకా కోవిషెల్డ్ వ్యాక్సిన్ యొక్క రెండవ మోతాదును ఇవ్వలేదు.
గత రెండు రోజులుగా వారిలో స్పల్ప కరోనా లక్షణాలు (3 Shimla doctors found Covid positive) కనిపించడంతో అత్యున్నత వైద్య బృందం సమక్షంలో మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గిరికీ పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం వారిని కోవిడ్ వార్డులో ఐసోలేషన్ చేసినట్లు తెలిపారు. అయితే ఇతరుల ద్వారానే వైరస్ వీరికి సోకినట్లు డాక్టర్ పతానియా వెల్లడించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా రెండో డోస్ ప్రక్రియ కూడా ఆరంభమైన విషయం తెలిసిందే. తొలిడోస్ వేసుకున్న వారికి ఈ విడతలో వ్యాక్సిన్ వేయనున్నారు.
కాగా మేము వ్యాక్సిన్‌ను ఇన్‌ఫెక్షన్‌తో లింక్ చేయలేము. మోతాదు తీసుకునే ముందు వారికి ఇన్‌ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు" అని డాక్టర్ రజనీష్ పథానియా చెప్పారు. టీకా యొక్క మొదటి మోతాదు పొందిన తరువాత వైద్యులు రోజూ పనిచేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రోగులకు చికిత్స చేసేటప్పుడు వారు సంక్రమణకు గురయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వారితో ఎంతమంది కలిసారనే దానిపై ఇంకా క్లారిటీ లేదని తెలిపారు.