COVID in India: భారత్‌లో 33 లక్షలకు పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాల పంపిణీ, తగ్గుముఖం పడుతున్న కొవిడ్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,083 కరోనా కేసులు నమోదు
Representational Image, COVID-19 - Vaccination (Photo Credits: PTI)

New Delhi, January 30:  భారత్‌లో కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ సాగుతోంది.  నిన్న ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 4,40,681 ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరి 29 నాటికి దేశవ్యాప్తంగా కరోనా టీకాలు పొందిన లబ్దిదారుల సంఖ్య 33 లక్షలు దాటినట్లు పేర్కొంది.

దేశంలో కొవిడ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటికంటే ఈరోజు కేసులు సుమారు 5 వేలు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో  13,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 1,07,33,131కు చేరింది. నిన్న ఒక్కరోజే 137 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,54,147కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,808 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,04,09,160 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,69,824 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

India's Vaccination Drive Update: 

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.98% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 1.58%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.44% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక జనవరి 29 వరకు దేశవ్యాప్తంగా 19,58,37,408 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,56,329 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 102 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు 1.20 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

శనివారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 102,007,448గా ఉండగా, మరణాలు 2,204,494కు పెరిగాయని అలాగే రికవరీ అయిన వారి సంఖ్య 56,372,909గా ఉందని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది