COVID-19 Vaccine (Photo Credits: Twitter)

New Delhi, January 22:  దేశంలో కొవిడ్ పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఒకవైపు రికవరీ రేటు పెరుగుతుండటం, మరోవైపు జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియతో భారత్ కరోనాపై సమర్థవంతమైన యుద్ధం చేస్తుంది. దీంతో ప్రతిరోజు నమోదయ్యే కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో  14,545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,06,25,428కు చేరింది. నిన్న ఒక్కరోజే 163 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,53,032కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,002 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,02,83,708 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,88,688 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.78% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 1.78%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.44% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID19 Recovery Rate:

ఇక జనవరి 21 వరకు దేశవ్యాప్తంగా 19,01,48,024 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 8,00,242 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక మరోవైపు దేశవ్యాప్తంగా కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చురుగ్గానే సాగుతోంది.  నిన్న ఒక్కరోజే, సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 1,92,581 ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరి 21 నాటికి దేశవ్యాప్తంగా కరోనా టీకాలు పొందిన లబ్దిదారుల సంఖ్య  9,99,065 చేరగా, శుక్రవారం ఉదయం నాటికి ఇది పది లక్షలు దాటింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా రోజుకు లక్ష టీకాల చొప్పున పంపిణీ జరుగుతోంది, రానురాను డోసుల సంఖ్య పెంచనున్నారు.