Representational Image, COVID-19 - Vaccination (Photo Credits: PTI)

New Delhi, January 15:  శనివారం నుంచి దేశంలో కోవిడ్ టీకా పంపిణీ ప్రారంభమవుతోంది. ఇక ఇప్పట్నించి విడతల వారీగా ఏడాది పొడవునా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. టీకా పరిమిత లభ్యత ఆధారంగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తయారుచేసిన లబ్ధిదారుల ప్రాధాన్యత జాబితా ఆధారంగా ప్రజలు కొవిడ్ టీకాను పొందనున్నారు. సాధారణ పౌరులకు ఏడాది మధ్య నుంచి టీకా లభించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

ఇక దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ, వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో  15,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,05,27,683కు చేరింది. నిన్న ఒక్కరోజే 191 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,51,918కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,975 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,01,62,738 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,13,027 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.52% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 2.03%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.44% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 18,49,62,401 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,30,096 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.