Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, January 14: దేశవ్యాప్త కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సమన్వయపరుస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుంది. ఈనెల 16 నుంచి మొదలుకొని వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో సుమారు 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మరియు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను డీజీసీఎ ఆమోదించగా, ఎవరికి ఏ టీకా అందించాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది. టీకా పొందగోరే లబ్దిదారుడు తనకు ఏ టీకా ఎంచుకునేదానిపై అవకాశం ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది.

మరోవైపు దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 16,946 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,05,12,093కు చేరింది. నిన్న ఒక్కరోజే 198 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,51,727కు పెరిగింది.

అలాగే,  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,652 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,01,46,763 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 2,13,603 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.52% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 2.03%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.44% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక జనవరి 13 వరకు దేశవ్యాప్తంగా 18,42,32,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,43,191 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.