Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, January 7: భారత్‌లో కొవిడ్ వ్యాప్తి ఇంకా ఉన్నప్పటికీ, కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం, దేశంలో గురువారం నాటికి మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి దాటింది. రికవరీ రేటు 96.36 శాతానికి పెరిగింది.

ఇక కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 20,346 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,03,95,278కు చేరింది. నిన్న ఒక్కరోజే 222 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,50,336కు పెరిగింది.

అలాగే,  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,587 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,00,16,859 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 2,28,083 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.36% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 2.19%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక జనవరి 6 వరకు దేశవ్యాప్తంగా 17,84,00,995 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,37,590 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 84 శాతం కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ ఘర్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల నుంచే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడిస్తుంది.

మరోవైపు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈరోజు లేదా రేపు వ్యాక్సిన్ పంపిణీకి తేదీలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతలో దాదాపు 30 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.