Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, December 23: భారతదేశంలో ఇటీవల కాలంగా ప్రతిరోజు 30 వేల లోపు స్థిరంగా కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తొలి విడత టీకా పంపిణీ చేయబడుతుందన్న వార్తల నేపథ్యంలో మున్ముందు కేసుల సంఖ్య ఎలా ఉండబోతుందో చూడాలి. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలు యధావిధిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 23,950 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 1,00,99,066కు చేరింది. నిన్న ఒక్కరోజే 333కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,46,444కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,895 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 96,63,382 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 2,89,240ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.69% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 2.86%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక డిసెంబర్ 22 వరకు దేశవ్యాప్తంగా 16,42,68,721 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,98,164 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 77.9 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు 1.71 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

బుధవారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,958,369గా ఉండగా, మరణాలు 1,715,945కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.