Coronavirus in India: దేశంలో భారీగా తగ్గుతున్న రోజూవారీ కేసులు, తాజాగా 80,834 మందికి కరోనా, కరోనా కట్టడికి ప్రపంచమంతా ఏకతాటిపై నడవాలని కోరిన ప్రధాని మోదీ, కేంద్రం సరైన వ్యూహాలను రచించాలంటే మృతుల సంఖ్య కచ్చితత్వంతో ఉండాలని తెలిపిన రణ్‌దీప్‌ గులేరియా
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi, June 13: భార‌త్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు (Coronavirus in India) లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. నిన్న 80,834 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసుల నమోదుకావడం ఇదే తొలిసారి. నిన్న 1,32,062 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కు (COVID-19 Tally in India) చేరింది. మరో 3,303 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,70,384కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,80,43,446 మంది కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా తాజా కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతున్నాయి. 10,26,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,31,95,048 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు కేంద్రం సరైన వ్యూహాలను రూపొందించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులు కరోనా మృతుల సంఖ్యను కచ్చితత్వంతో వెల్లడించాలని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వల్ల చెడు జరగడం తప్ప.. ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మరణాల కచ్చితత్వం కోసం డెత్‌ ఆడిట్‌ను నిర్వహించాలన్నారు. కొవిడ్‌ మరణాలను పలు రాష్ట్రాలు తగ్గించి వెల్లడిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని తెలిపిన కేంద్రం, ముగిసిన 44వ జీఎస్టీ మండలి సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకున్న మండలి, కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గింపు

కరోనా సంబంధిత సాంకేతికతలకు ‘మేధో సంపత్తి హక్కుల పరమైన వాణిజ్య అంశాలను’ (ట్రిప్స్‌ను) రద్దు చేయాలని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ వద్ద భారత్‌, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని జి-7 దేశాల కూటమికి ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో జరుగుతున్న జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘ఒకే ధరిత్రి.. ఒకే ఆరోగ్యం’ అనే దృక్పథంతో కలిసికట్టుగా ముందడుగు వేసి కరోనాను సమర్థంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు యావత్‌ ప్రపంచానికి సందేశం పంపాలని మోదీ చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు రాకుండా ప్రపంచమంతా సంఘీభావంతో మెలగాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్య, పారదర్శక సమాజాలకు ఈ సవాల్‌ను ఎదుర్కోవడంలో ప్రత్యేక బాధ్యత ఉంది. ప్రపంచవ్యాప్త ఆరోగ్య పరిరక్షణ విషయంలో తన వంతు పాత్ర పోషించడానికి భారత్‌ కట్టుబడి ఉంది’’ అని వివరించారు. టీకాల కార్యక్రమంలో, కరోనా బాధితులకు చేరువగా వెళ్లినవారిని గుర్తించడంలో మన దేశం విజయవంతంగా వాడిన డిజిటల్‌ సాధనాల గురించి ప్రధాని వివరించారు. కరోనాపై పోరులో సమాజం మొత్తాన్ని ఏకోన్ముఖం చేయగలిగినట్లు చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసటగా నిలిచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కూడా జి-7 సదస్సును ఉద్దేశించి రెండు విడతల్లో ఆయన ప్రసంగించనున్నారు.